Leaving India | న్యూఢిల్లీ, మార్చి 26: భారతీయ సంపన్నుల్లో దాదాపు 22 శాతం మంది స్వదేశాన్ని వీడాలనుకుంటున్నారు. వీరంతా మెరుగైన జీవన పరిస్థితులు, నాణ్యమైన జీవన ప్రమాణాలు, సులభమైన వ్యాపార వాతావరణం ఉన్న విదేశాలకు వలసపోవాలనుకుంటున్నట్టు తాజా సర్వేలో తేలింది. భారత్‌లో లీడింగ్ వెల్త్ మేనేజర్‌గా కొనసాగుతున్న ‘కొటక్ ప్రైవేట్’ సంస్థ ప్రముఖ కన్సల్టెన్సీ ‘ఈవై’ (ఎర్నెస్ట్ యంగ్)తో కలిసి దేశంలోని అత్యంత సంపన్నులైన 150 మందిపై ఈ సర్వే నిర్వహించింది.
భారత్‌లోని ప్రతి ఐదుగురు ధనికుల్లో ఒకరు ప్రస్తుతం విదేశాలకు వలసవెళ్లాలన్న యోచనలో ఉన్నారని, వారిలో ఎక్కువ మంది భారత పౌరసత్వాన్ని నిలబెట్టుకుంటూనే తమకు నచ్చిన ఆతిథ్య దేశంలో శాశ్వతంగా నివసించాలని భావిస్తున్నారని సర్వేలో తేలింది.
ఎక్కువ మంది అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలతోపాటు గోల్డెన్ వీసా పథకాన్ని అమలు చేస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో స్థిరపడాలనుకుంటున్నట్టు సర్వేలో వెల్లడైంది.
భారత్‌ను వీడాలనుకుంటున్న సంపన్నులు మెరుగైన జీవన ప్రమాణాలతోపాటు నాణ్యమైన విద్య, వైద్య, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను, మెరుగైన జీవనశైలిని కోరుకుంటున్నట్టు ఈ సర్వేలో తేలింది. వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేసుకోవాలన్న ప్రధాన ధ్యేయంతో విదేశాలకు వలస పోవాలనుకుంటున్నట్టు ఈ సర్వేలో మూడింట రెండొంతుల మంది సంపన్నులు స్పష్టం చేశారు.