Maharashtra | మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నాందేడ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గత 24 గంటల్లో 24 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 12 మంది నవజాత శిశువులు ఉన్నారు. మందుల కొరత కారణంగానే మరణాలు సంభవించాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణాలు కోల్పోయిన నవజాత శిశువుల్లో ఆరుగురు బాలికలు, ఆరుగురు బాలురు ఉన్నారని ఆసుపత్రి వైద్యుడు పేర్కొన్నారు. అయితే, నవజాత శిశువులు కాకుండా మరణించిన మరో 12 మంది పాముకాటుతో పాటు వివిధ వ్యాధుల కారణంగా ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.
ఆసుపత్రి ‘తృతీయ స్థాయి సంరక్షణ కేంద్రం’ మాత్రమేనన్నారు. 70-80 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఏకైక ఆరోగ్య కేంద్రం ఇదే కావడంతో రోగులు ఎక్కువగా వస్తున్నారన్నారు. ఆసుపత్రిలో చేరే ఆరోగుల సంఖ్య ఇన్స్టిట్యూట్ బడ్జెట్ను మించిపోతుందని, ఈ క్రమంలో మందుల కొరత ఏర్పడుతుందన్నారు. హాఫ్కిన్ అనే సంస్థ మందులు కొనుగోలు చేయాల్సి ఉందని, నిధుల సర్దుబాటు కాకపోవడంతో జరగలేదన్నారు. స్థానిక దుకాణాల్లో కొనుగోలు చేసిన తర్వాత రోగులకు మందులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే, ఆసుపత్రులో మరణాలపై ఎన్సీపీ ప్రతినిధి వికాస్ లవాండే ప్రభుత్వంపై మండిపడ్డారు. వైద్య సేవలపై పట్టించుకోండా ఇతర కార్యక్రమాలు చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది సైతం బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మరణాలు ప్రభుత్వ హత్యలేనన్నారు. ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్సర్ ఈవెంటులు, విదేశీ పర్యటనలపై బిజీగా ఉన్నారని, రాష్ట్రానికి సేవ చేయడం మరిచారన్నారు. ఘటనపై విచారణ జరిపించాలని ఎంపీ సుప్రియా సూలే డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలన్నారు.