సుక్మా: కరుడుగట్టిన 23 మంది నక్సలైట్లు ఇవాళ చత్తీస్‌ఘడ్‌లో లొంగిపోయారు(Naxals Surrender). దీంట్లో మూడు జంటలు కూడా ఉన్నాయి. ఆ మొత్తం నక్సలైట్లపై సుమారు కోటి 18 లక్షల నజరానా ఉన్నది. సుక్మా జిల్లాలో ఆ నక్సల్స్ లొంగిపోయినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. సరెండర్ అయిన నక్సల్స్‌లో 11 మంది సీనియర్ కేడర్ సబ్యులు ఉన్నారు.
పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నెంబర్ 1లో వాళ్లు ఉంటున్నారు. మావోయిస్టు ఐడియాలజీ, గిరిజనులపై నక్సల్స్ పాల్పడుతున అకృత్యాలను తట్టుకోలేక లొంగిపోయారని సుక్మా ఎస్పీ కిరణ్ చావన్ తెలిపారు. లొంగిపోయిన నక్సల్స్‌లో 9 మంది మహిళలు ఉన్నారు. లోకేశ్ అలియాస్ పొడియం బీమా, రమేశ్ అలియాస్ కల్మా కేసా, కవాసి మాసా, మడ్కమ్ హంగా, నుపు గంగి, పునెం దేవి, పరాస్కి పాండే, మాద్వి జోగా, నుప్పు లచ్చు, పొడియం సుక్రామ్, దుది బీమా.. ప్రతి ఒక్కరిపై 8 లక్షల నజరానా ఉంది.
డివిజనల్ కమిటీ సభ్యుడిగా లోకేశ్ ఉన్నాడు. పీఎల్ఎల్ఏకు చెందిన బెటాలియన్ తగ్గిపోతున్నట్లు పోలీసులు చెప్పారు. సుక్మా-బీజాపూర్ అంతర్ జిల్లా సరిహద్దుల్లో ప్రాబల్యం తగ్గినట్లు ఎస్పీ చావన్ చెప్పారు. నలుగురు నక్సల్ కేడర్‌పై 5 లక్షలు, మరొకరిపై మూడు లక్షలు, మరో ఏడు మందిపై లక్ష చొప్పున నజరానా ఉన్నట్లు చావన్ తెలిపారు.