న్యూఢిల్లీ, జూలై 18 : రిజిస్ట్రేషన్ అయినప్పటికీ గుర్తింపు లేని రాజకీయ పార్టీల ఆదాయాలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో అమాంతంగా 223 శాతం పెరిగిపోయాయి. వీటిలో 73 శాతం పార్టీలు తమ ఆర్థిక వివరాలను బహిర్గతం చేయడంలో విఫలమైనట్లు ఎన్జీఓ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) వెల్లడించింది.
అత్యధిక ఆదాయం సమకూర్చుకున్న గుర్తింపులేని రాజకీయ పార్టీలలో గుజరాత్‌కే ప్రథమ స్థానం దక్కింది. మొత్తం టాప్ 10 పార్టీలలో గుజరాత్ పార్టీలదే అత్యధికంగా రూ.1158 కోట్లు (70 శాతానికి పైగా) ఉంది. వీటిలో గుజరాత్‌కు చెందిన భారతీయ నేషనల్ జనతా దళ్ 2022-23లో తన ఆదాయాన్ని రూ.576.58 కోట్లుగా చూపించింది. తర్వాతి స్థానంలో న్యూ ఇండియా యునైటెడ్ పార్టీ(రూ. 407.45 కోట్లు) ఉంది.
అత్యధిక ఆదాయం ఉన్న పార్టీలలో చాలా పార్టీలు 2015 తర్వాతే ఏర్పడ్డాయి. 2019-20 నుంచి 2023-24 మధ్య తమ మొత్తం ఆదాయం రూ. 957 కోట్లు ఉన్నట్లు భారతీయ నేషనల్ జనతా దళ్ ప్రకటించి గుర్తింపు లేని పార్టీలలో అత్యంత సంపన్న పార్టీగా నిలిచింది. టాప్ 10 పార్టీలు ప్రకటించిన మొత్తం ఆదాయం రూ. 1581 కోట్లు కాగా ఇందులో గుజరాత్‌కు చెందిన పార్టీల వాటా రూ. 1158 కోట్లు(73.22 శాతం) ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది.