రాయ్‌పూర్, జనవరి 7: బీజేపీ పాలిత ఛత్తీస్‌గఢ్‌లోని కవర్ధ జిల్లాలో రైతుల నుంచి కొనుగోలు చేసిన 26 వేల క్వింటాళ్ల వరి ధాన్యం గోడౌన్ల నుంచి అదృశ్యమైంది. ఈ ధాన్యం ఏమైపోయింది? అని అడిగిన వారికి అక్కడి అధికారులు చెప్పిన సమాధానం షాకిచ్చింది. సుమారు 7 కోట్ల రూపాయల విలువ చేసే ఆ ధాన్యాన్ని ఎలుకలు తినేశాయని తాపీగా చెప్పారు. అంతేకాకుండా చెదపురుగులు, వాతావరణ ప్రభావం వల్ల కూడా ధాన్యం పాడైపోయిందని వారు చెప్పడంతో తొలుత విస్తుపోయిన ఉన్నతాధికారులు తర్వాత దానిపై దర్యాప్తు ప్రారంభించగా పలు అక్రమాలు బయటపడ్డాయి.
బజార్చార్భాటా సెంటర్లో 22 వేల క్వింటాళ్ల ధాన్యం అదృశ్యం అయ్యింది. బగార్రా సెంటర్లో కూడా వేల క్వింటాళ్లు కన్పించకుండా పోయింది. ఆయా సెంటర్లలోని సీసీ కెమెరాలను తరచూ ట్యాంపరింగ్ చేశారు. అందులో పనిచేసే కార్మికులకు నకిలీ హాజరును నమోదు చేయడమే కాక, నాసిరకం ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నకిలీ బిల్లులు సృష్టించారు. ధాన్యం సేకరణ సెంటర్ వ్యక్తులతో కుమ్మక్కై నకిలీ ఎంట్రీ, ఎగ్జిట్లను కూడా నమోదు చేసినట్టు గుర్తించారు.