దిస్పూర్: అస్సాంలో దారుణం చోటుచేసుకున్నది. పెండ్లి కాకుండానే తల్లయిన యువతి, హాస్పిటల్ నుంచి డిశ్చార్జి కాకముంటే నవజాత శిశువుని (Newborn) అమ్మేసింది. జోయ్సాగర్లోని శివసాగర్ సివిల్ దవాఖాన (ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నది)లో జూన్ 23న 22 ఏండ్ల యువతి శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు వివాహం కాకపోవడంతో ఆ శిశువును వదిలించుకోవాలనుకున్నది. విషయం గ్రహించిన హాస్పిటల్ సిబ్బంది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC)కి సమాచారం అందించారు. దీంతో వారు ఆ యువతితోపాటు ఆమె తల్లికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
అయినా తీరు మార్చుకోని ఆ తల్లీ కూతుర్లు.. జూలై 10న హాస్పిటల్ ఆవరణలోనే ఆ చిన్నారిని రూ.50 వేలకు అమ్మేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతితోపాటు ఆమె తల్లి, ఆశా కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారు. అయితే చిన్నారి ఎక్కడ ఉందనే విషయం తెలియరాలేదు. ఆ చిన్నారిని గుర్తించేందుకు యత్నిస్తున్నామని చెప్పారు.