Electrocution : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని బృందావనంలో విషాదం చోటుచేసుకుంది. బృందావనం (Vrindavan) లోని ఇస్కాన్ ఆలయం వెలుపల చెప్పులు విడిచి వస్తుండగా.. కరెంట్ షాక్ కొట్టడంతో 21 ఏళ్ల అభిజ్ఞాన్ గుప్తా అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని ఛతార్పూర్ (Chatarpur) కు చెందిన అభిజ్ఞాన్ గుప్తా (Abhignan Gupta) తన తండ్రితో కలిసి సోమవారం బృందావన్‌కు వెళ్లాడు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో అధికారులు భక్తుల సౌకర్యార్థం ఆలయంలో పలుచోట్ల వాటర్-స్ప్రే కూలర్లు ఏర్పాటు చేశారు.
ఆలయ ప్రవేశ ద్వారం సమీపంలో చెప్పులు విడిచి వస్తున్న క్రమంలో అభిజ్ఞాన్ అక్కడే ఉన్న కూలర్‌ను పట్టుకున్నాడు. దాంతో అతడు కరెంట్ షాక్‌కు గురవడంతో గమనించిన ఇతర వ్యక్తులు అతడికి కాపాడడానికి ప్రయత్నించారు. హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. వాటర్-స్ప్రే కూలర్ నిర్వహణ సరిగా లేకపోవడంవల్లే ఈ విద్యుదాఘాతం సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.