ఆదివారం 29 మార్చి 2020
National - Mar 04, 2020 , 22:07:52

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌.. మొక్కలు నాటిన హైపర్‌ ఆది

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌.. మొక్కలు నాటిన హైపర్‌ ఆది

విశాఖపట్నం: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు పాల్గొని, ఒక్కొక్కరు మూడు మొక్కలు చొప్పున నాటుతూ.. మరో ముగ్గురిని మొక్కలు నాటాలని నామినేట్‌ చేస్తున్నారు. సవాలును స్వీకరించిన అనేక మంది ప్రముఖులు, సామాన్యులు సైతం మొక్కలు నాటుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగమవుతున్నారు. కాగా, ఇవాళ.. జబర్ధస్త్‌ ఫేం, సినీనటుడు హైపర్‌ ఆది.. తన సహచర నటుడు ఆటో రాంప్రసాద్‌(ఆర్‌పీ) విసిరిన గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించి, విశాఖపట్నంలోని తన నివాసంలో మొక్కలు నాటారు. 

ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ.. తనను ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వామిని చేసిన నా మిత్రుడు రామ్‌ ప్రసాద్‌కు థాంక్స్‌ చెబుతున్నానని అన్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం ఎంత విజయవంతమైందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటారు. కాగా, హరితహారం సీజనల్‌ కార్యక్రమం కావడంతో ఎంపీ సంతోష్‌ కుమార్‌.. ఈ కార్యక్రమాన్ని ఆపకుండా నిర్విరామంగా కొనసాగించాలన్న ఉద్దేశ్యంతో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఆయన చాలెంజ్‌ను సానుకూలంగా స్వీకరించిన అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని, మొక్కలు నాటుతున్నారనీ.. ఈ సందర్భంగా ఆది సంతోష్‌ కుమార్‌ కు ధన్యవాదాలు  తెలిపాడు. 

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఆది మరో ముగ్గురికి చాలెంజ్‌ విసిరి మొక్కలు నాటాలని కోరాడు. వారిలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌, వ్యాఖ్యాతలు ప్రదీప్‌, వర్షిణి ఉన్నారు.


logo