బెంగళూరు, డిసెంబర్ 27: ఉత్తరాదిలోని బీజేపీ రాష్ర్టాలను అనుసరిస్తూ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ కూల్చివేతలకు దిగింది. బెంగళూరు శివారులోని ఒక గ్రామంలో 200 ఇండ్లను కూల్చివేయడంతో 400 మంది నిరాశ్రయులయ్యారు. వీరిలో చాలామంది ముస్లింలే. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యను కేరళ ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది. ఉత్తరాది రాష్ర్టాలో విస్తృతంగా కన్పించే బుల్డోజర్ రాజ్‌ను కాంగ్రెస్ ఇక్కడ చూపిస్తున్నదని పేర్కొంది. కాంగ్రెస్ మైనారిటీ రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆరోపించింది. కొగిలు గ్రామం వాసిమ్ లే అవుట్ లోని ఫకీర్ కాలనీలో కర్ణాటక ప్రభుత్వం ఈ నెల 22 ఉదయం నాలు గు గంటలకు చేపట్టిన తొలగింపు కార్యక్రమంలో 200 ఇండ్లను కూల్చివేయడంతో 400 కుటుంబాలు నిరాశ్రయులై చలిలో బిక్కుబిక్కుమంటూ గడిపాయి.
150 మంది పోలీసుల బందోబస్తు మధ్య నాలుగు జేసీబీలతో బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (బీఎస్‌డబ్ల్యూఎంఎల్) ఈ తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టింది. ఉర్దూ పాఠశాలను ఆనుకుని ఉన్న సరస్సు వద్ద ప్రభుత్వ స్థలంలో ఈ ఇండ్లను అక్రమంగా నిర్మించారని ప్రభుత్వం తెలిపింది. తమకు కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా హఠాత్తుగా పోలీసులతో బలవంతంగా ఖాళీ చేయించారని బాధితులు వాపోయారు. కాగా, తాము ఇక్కడ 25 ఏండ్లుగా ఉంటున్నామని పలువురు బాధితులు తెలిపారు. ఇక్కడ వలసవాదులు ఎక్కువగా ఉంటున్నారని స్థానిక నేత ఒకరు తెలిపారు.
పెద్ద యెత్తున నిరసనలు
కాంగ్రెస్ ప్రభుత్వ చర్యను నిరసిస్తూ బాధితులు ఈ వారమంతా నిరసనలు కొనసాగించారు. కొంతమంది రెవెన్యూ మంత్రి కృష్ణ బైర్ గౌడ ఇంటి వద్ద నిరసనలు చేపట్టారు. వీరికి మద్దతుగా దళిత సంఘర్షణ సమితి, మరికొన్ని సంస్థలు ఆందోళనలో పాల్గొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తప్పుబట్టారు.