బస్తర్: తన ఈడు పిల్లలు ఆనందంగా ఆడుకుంటూ ఉంటే.. ఆ బాలిక మాత్రం చీకటి గదిలోనే ఏండ్లపాటు మగ్గిపోయింది. ఆరేండ్ల వయస్సులో సొంత ఇంట్లోనే బందీ అయిన లిసా 20 ఏండ్ల తర్వాత ఇటీవల జన జీవనంలోకి వచ్చింది. అయితే ఇన్నేండ్లుగా చీకటిలో మగ్గిపోవడంతో ఆమె వెలుగును చూసే శక్తిని కోల్పోయింది.
ఈ విషాద ఘటన ఛత్తీస్‌ఘడ్‌లో జరిగింది. ఇంత అమానుషానికి కారణం.. కూతురిని రక్షించుకోలేనన్న ఆమె తండ్రి అభద్రతా భావం! వివరాల్లోకి వెళ్తే…బస్తర్‌లోని బకవండ్ గ్రామానికి చెందిన లిసా 2000 సంవత్సరంలో రెండో తరగతి చదువుతున్నప్పుడు ఆమెను ఓ గ్రామస్తుడు చంపేస్తానని బెదిరించాడు. దీంతో లిసా భయంతో వణికిపోయింది. అప్పటికే ఆమె తల్లి చనిపోయింది. వ్యవసాయం చేసే ఆమె తండ్రి తన కూతురిని రక్షించడానికి ఎవరూ లేరని భయపడి.. ఆమెను 20 ఏండ్ల పాటు చీకటి గదిలో బందీగా ఉంచాలని నిర్ణయించాడు. ఆమెను ఇంట్లోనే ఓ కిటికీలు లేని గదిలో ఉంచి తాళం వేశాడు. రోజూ ఆహారం ఇవ్వడానికి మాత్రమే తలుపులు తెరిచేవాడు.