కోల్‌కతా: టీఎంసీ నేత మమతా బెనర్జీకి భారీ జలక్ తగలనున్నది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సుమారు 20 మంది లోక్‌సభ ఎంపీలు ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసే ఆలోచనలో ఉన్నారు. టీఎంసీ లోక్‌సభ చీఫ్ విఫ్ కకోలీ ఘోష్(MP Kakoli Ghosh) ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడైంది. 20 టీఎంసీ ఎంపీలు ఎన్డీఏలో చేరనున్న విషయాన్ని ఆమె కన్ఫర్మ్ చేశారు. తనతో పాటు మొత్తం 20 మంది ఎంపీలు.. స్పీకర్‌ను కలిసి ఎన్డీఏలో చేరే అంశంపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయనున్నట్లు ఆమె చెప్పారు. ఎంపీల మధ్య జరిగిన విస్తృత స్థాయి చర్చ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు.
ప్రస్తుతానికి లోక్‌సభ టీఎంసీ చీఫ్ విప్‌గా తానే కొనసాగుతున్నట్లు కోలీ ఘోష్ తెలిపారు. ఆ హోదాలోనే మిగితా ఎంపీలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ఎంపీలు ఆమోదించారని, ఇక భవిష్యత్తు రాజకీయం ఎన్డీఏతో ఉండబోనున్నట్లు ఆమె చెప్పారు. ఇటీవల రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ కలిసిన తరహాలోనే .. లోక్‌సభలో ఎన్డీఏ కూటమిలో టీఎంసీ ఎంపీలు చేరుతారని ఊహాగానాలు వినిస్తున్నాయి.
లోక్‌సభలో ప్రస్తుతం 28 మంది టీఎంసీ ఎంపీలు ఉన్నారు. ఒకవేళ ఎన్డీఏలో ఆ పార్టీ చేరాలంటే, రెండో వంతు మెజారిటీ కింద 19 మంది ఎంపీలు చేరితే అప్పుడే పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించదు. ఇక రాజ్యసభలో కూడా టీఎంసీ చీలిపోయే అవకాశం ఉన్నది. రాజ్యసభలో మొత్తం 13 మంది టీఎంసీ ఎంపీలు ఉన్నారు. అయితే దీంట్లో 9 మంది ఎన్డీఏలో చేరిన టీఎంసీ ఆనవాళ్లు మాయమైనట్లే అవుతుంది. టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ ఇప్పటికే రాజీనామా చేసిన విషయం తెలిసిందే.