Jamnagar | రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని దాదాపు తొమ్మిదిగంటల పాటు శ్రమించి చిన్నారిని ప్రాణాలతో బయటకు తీశారు. అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే జామ్‌నగర్ జిల్లాలోని గోవానా గ్రామంలో మంగళవారం రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు.
తల్లిదండ్రులు, స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) సంఘటనా స్థలానికి చేరుకుంది. చిన్నారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు నాలుగు గంటల పాటు చిన్నారిని బయటకు తీసేందుకు శ్రమించారు. ఆ తర్వాత వడోదర నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పిలిపించారు. ఎన్డీఆర్ఎస్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సమష్టి కృషి తొమ్మిది గంటలు శ్రమించి చిన్నారికి ప్రాణాలతో బయటకు తీశారు.
ఆ తర్వాత అంబులెన్స్‌లో జామ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుజరాత్‌లోని ద్వారక జిల్లాలో గత నెలలో మూడేళ్ల బాలిక పడిపోయిన విషయం తెలిసిందే. బాలికను బోరుబావి నుంచి వెలికి తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది. ఎనిమిది గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత ఖంభాలియా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు.