శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో సామాన్య పౌరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. గడిచిన ఐదు రోజుల్లో ఏడుగురిని కాల్చి చంపారు. గురువారం శ్రీనగర్‌లో ఓ సర్కారు బడిలో చొరబడి మహిళా ప్రిన్సిపాల్ సూపీందర్ కౌర్, ఉపాధ్యాయుడు దీపక్ చంద్‌ను పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చేశారు. ఘటన జరిగిన సమయంలో బడిలో పిల్లలు లేరు. కశ్మీర్లో మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని ఇటీవల ఉగ్రదాడులు పెరగడం భద్రతాపరంగా తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నది. అంతే కాకుండా కశ్మీర్లో ప్రధాన నగరమైన శ్రీనగర్‌లోనే ఉగ్రదాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లో మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి, ఇక్కడి ముస్లింలకు చెడ్డ పేరు తీసుకురావడానికే ఈ ఉగ్రదాడులు జరుగుతున్నాయని డీజీపీ దిల్బాగ్ సింగ్ అన్నారు. పాక్ ఆదేశాలతోనే ఉగ్రవాదులు ఈ ఘాతుకాలకు తెగబడుతున్నారని చెప్పారు.