బీజాపూర్: గతకొంత కాలంగా వరుస ఎదురుదెబ్బలు తింటున్న మావోయిస్టులు (Maoists) పోలీసులపై పంజా విసిరారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ (Bijapur) జిల్లా మండిమర్క అటవీ ప్రాంతంలో ఐఈడీ (IED) పేల్చారు. దీంతో ఇద్దరు జవాన్లు మరణించారు. మరో నలుగురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలను ముగించుకుని తిరిగి వస్తుండగా మావోయిస్టులు మందుపాతర పేల్చారని అధికారులు తెలిపారు. మృతులను స్టేట్ టాస్క్ఫోర్సుకు చెందిన చీఫ్ కానిస్టేబుల్ భరత్ లాల్ సాహూ, కానిస్టేబుల్ సాతెర్ సింగ్‌గా గుర్తించామన్నారు. కానిస్టేబుళ్లు పురుషోత్తమ్ నాగ్, కోమల్ యాదవ్, సియారామ్ సోరి, సంజయ్ సింగ్ గాయపడ్డారని చెప్పారు. ప్రస్తుతం వారంతా జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం వారిని రాయ్‌పూర్‌కి తరలించనున్నామని తెలిపారు.
కాగా, మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లిన విషయం తెలిసిందే. బుధవారం మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఓ ఎస్సై, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. గడ్చిరోలి ఎస్పీ నీలోత్పల్ కథనం ప్రకారం.. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా వండోలి గ్రామ సమీపంలో సుమారు 15 మంది మావోయిస్టులు ప్రచారం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు భద్రతా దళాలు గాలింపు చేపట్టగా వారికి మావోయిస్టులు తారసపడి కాల్పులు జరిపారు. సుమారు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఎస్ఐ సతీశ్ పాటిల్, మరో ఇద్దరు జవాన్లు గాయపడగా వారిని హెలికాప్టర్లో తరలించారు.
కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో 12 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మూడు ఏకే-47లు, రెండు ఇన్సాస్లు, ఒక కార్బైన్, ఒక ఎస్ఎల్ఆర్, ఇతర వస్తు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో తిప్పగఢ్ దళానికి చెందిన డీవీసీఎం లక్ష్మణ్ ఆత్రం, విశాల్ ఆత్రం ఉన్నట్టు పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఆపరేషన్ గురించి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ గడ్చిరోలి పోలీసుల కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తనకు ఎస్పీ, ఐజీలు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద ఆపరేషన్ అని చెప్పారు. గడ్చిరోలి పోలీసులను అభినందించారు. వారికి 51 లక్షల రివార్డును ప్రకటించారు.