సోపోర్: జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌లో ఇద్దరు హైబ్రీడ్ టెర్రరిస్టులను (Hybrid terrorists) పోలీసులు అరెస్టు చేశారు. సోపోర్‌లోని షా ఫైజల్ మార్కెట్ వద్ద పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద బ్యాగుతో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని గుర్తించారు. అయితే పోలీసులను గమనించిన అతడు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా లష్కరే తొయిబాకు చెందిన రిజ్వాన్ ముస్తాక్ వానీగా గుర్తించారు. తనతోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడని, అతని పేరు జమీల్ అహ్మద్ అనిచెప్పాడు. దీంతో జమీల్ నుంచి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారిద్దరు హైబ్రీడ్ టెర్రరిస్టులని, కశ్మీర్‌లోని స్థానికేతరులు, మైనార్టీలు, పౌరులు, భద్రతా దళాలపై దాడులు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. వారివద్ద ఓ పిస్తోల్, మ్యాగజైన్, ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. విచారణ ఇంకా కొనసాగుతున్నది చెప్పారు. కాగా, అనంత్‌నాగ్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్ పనిచేస్తున్న ఇద్దరు నేపాలీలను టెర్రరిస్టులు చంపిన రెండు రోజుల తర్వాత వీరిని అరెస్టు చేయడం గమనార్హం.