భోపాల్: ఇంటి ముందు చలి మంటలు కాచుకుంటున్న వ్యక్తుల పైకి ఓ బీజేపీ యువ నాయకుడి కారు దూసుకుపోయి ఓ మైనర్ సహా ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలో శనివారం ఈ దారుణం చోటు చేసుకుంది. పోర్సా-జోటాయ్ రోడ్డు బైపాస్ ఇంటర్సెక్షన్ వద్ద జరిగిన ఈ ఘటనలో ఓ 65 ఏండ్ల వృద్ధుడు, ఓ 10 ఏండ్ల బాలుడు మరణించారు.
పోర్సాలోని బీజేపీ యువజన విభాగం ఉపాధ్యక్షుడు దీపేంద్ర భదౌరియా ప్రమాదం జరిగిన సమయంలో కారును నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే నిందితుడిని వెంటాడి పట్టుకున్న స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే కొద్ది నిమిషాల్లోనే అతను పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఆగ్రహోదగ్రులైన గ్రామస్తులు దాదాపు 20 నిమిషాలు అడ్డగించి నిరసనకు దిగారు.