భోపాల్: ఆడుకోవడానికి వెళ్లిన ఎనిమిదేండ్ల చిన్నారి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. ఆమెను రక్షించడానికి గ్రామస్థులు ప్రయత్నించారు. ఈ క్రమంలో మరో 40 మంది అందులో పడిపోయిన ఘటన మధ్యప్రదేశ్లోని విధిషా జిల్లాలో జరిగింది. విధిషా సమీపంలోని గంజ్ బసోడాలో గురువారం సాయంత్రం ఓ ఎనిమిదేండ్ల బాలుడు ఆడుకుంటూ బావిలో పడిపోయింది. దీంతో ఆ చిన్నారిని రక్షించడానికి పలువురు గ్రామస్తులు బావి వద్ద నిలబడ్డారు.
అయితే వారి బరువు అధికమవడంతో బావి గోడ కూలిపోయింది. దీంతో సుమారు 40 మంది అందులో పడిపోయారు. వారిని రక్షించడానికి అధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ బృందం (ఎన్డీఆర్ఎఫ్) సహాయక చర్యలు ప్రారంభించారు. అర్ధరాత్రి వరకు 23 మందిని రక్షించారు. వారిలో 13 మందిని దవాఖానకు తరలించారు. కాగా, ఆ చిన్నారి ఇంకా బావిలోనే ఉన్నదని, ఆమెకు గాయాలయ్యాయా లేదా అనే విషయం తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికి తీశామని చెప్పారు.
ఈ దుర్ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. సహాయకచర్యలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈమేరకు సీఎం ట్వీట్ చేశారు.
गंजबासौदा में हुई दुर्घटना में अब तक दो लोगों के निधन की दुःखद सूचना मिली है, उनके शव निकाले जा चुके हैं। मैं उन्हें श्रद्धांजलि अर्पित करता हूँ और ईश्वर से प्रार्थना करता हूँ कि वे दिवंगत आत्माओं को शांति दें। बचावकार्य अभी जारी है, मैं लगातार मॉनिटरिंग कर रहा हूँ।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 15, 2021