తిరువనంతపురం/కొచ్చి, అక్టోబర్ 29: కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో వరుస బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. ఎర్నాకుళం జిల్లా కలమస్సేరిలోని ‘జెహోవా విట్నెసెస్’ అనే క్రైస్తవ మత గ్రూపు ప్రజలు సమావేశమైన జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన ఈ పేలుళ్ల ఘటనలో ఇద్దరు మహిళలు మరణించగా, మరో 51 మందికి గాయాలయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. కన్వెన్షన్ హాలులో ప్రార్థనలు ప్రారంభమైన తర్వాత నిమిషాల వ్యవధిలో మూడుసార్లు పేలుళ్లు జరిగాయి.
టిఫిన్ బాక్స్‌లో అమర్చిన ఐఈడీ పదార్థంతో పేలుళ్లు జరిపినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆదివారం ఉదయం 9.40 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించిందని రాష్ట్ర డీజీపీ దర్వేశ్ సాహెబ్ వెల్లడించారు. పేలుడు వెనుక ఉగ్ర కుట్ర ఉన్నదా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు డీజీపీ స్పందిస్తూ.. ఉగ్ర కోణంతో సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, సిట్ దర్యాప్తు తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. ఎన్ఐఏతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. పేలుడు సమయంలో కన్వెన్షన్ సెంటర్లో దాదాపు 2,300 మంది ఉన్నారు.
నేడు అఖిలపక్ష సమావేశం
పేలుడు ఘటన నేపథ్యంలో అత్యవసరంగా చర్చించేందుకు సీఎం విజయన్ సోమవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కన్వెన్వన్ సెంటర్లో పేలుడు ఘటన దురదృష్టకరమని, తీవ్రమైనదని విజయన్ అన్నారు.
బాంబు అమర్చింది నేనే..!
బాంబు పేలుళ్లకు తానే బాధ్యడినంటూ డొమినిక్ మార్టిన్ అనే ఓ వ్యక్తి త్రిసూర్ జిల్లా కొడకారా పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. కలమస్సేరిలో బాంబు అమర్చిన వారిలో తాను కూడా ఒకడినని చెప్పాడని, అందుకు తగిన ఆధారాలు కూడా ఇచ్చాడని అధికారులు తెలిపారు. తాను జెహోవాస్ విట్నెసెస్ క్రిస్టియన్ గ్రూపునకు చెందినవాడనని కూడా చెప్పాడని పేర్కొన్నారు. లొంగిపోయేందుకు ముందు మార్టిన్ ఒక వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. తమ సంఘం బోధనలు దేశద్రోహంగా ఉన్నాయని, అందుకే ఈ చర్యకు పాల్పడినట్టు అందులో పేర్కొన్నారు.
ఎవరీ ‘జెహోవాస్ విట్నెసెస్’?
మైనారిటీ క్రైస్తవ గ్రూపు అయిన ‘జెహోవాస్ విట్నెసెస్’ మత సమూహం 19వ శతాబ్దంలో అమెరికా ఉద్భవించింది. చరిత్రకారుల ప్రకారం ఈ మత సమూహం అంతర్జాతీయ బైబిల్ స్టూడెంట్స్ అసోసియేషన్‌కి చెందిన ఒక విభాగం. దీన్ని చార్లెస్ టజే రస్సెల్ 1872లో పిట్స్‌బర్గ్‌లో స్థాపించాడు. ఈ కమ్యూనిటీ ప్రజలు యేసు ప్రభువును దేవుడిగా కాకుండా దేవుడి కుమారుడిగా భావిస్తున్నారు.