లక్నో: ఇద్దరు పిల్లలు అనుమానాస్పదంగా మరణించారు. గుడికి వెళ్లిన వారిద్దరూ రోడ్డు పక్కన శవాలుగా కనిపించారు. (Children Dead) దీంతో క్షుద్రపూజల కోసం ఆ చిన్నారులను చంపి ఉంటారని తల్లిదండ్రులు అనుమానించారు. రహదారిని దిగ్బంధించి నిరసన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దేవ్‌బంద్ పరిధిలోని భయాల్ గ్రామానికి చెందిన 11 ఏళ్ల దేవ్, బంధువైన 9 ఏళ్ల మహి కలిసి గురువారం గ్రామ శివారులోని గుడికి వెళ్లారు.
కాగా, ఆ ఇద్దరు పిల్లలు రాత్రి వరకు ఇంటికి తిరిగిరాలేదు. దీంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పిల్లల కోసం అన్ని చోట్ల వెతికారు. అర్ధరాత్రి వేళ రోడ్డు పక్కన పిల్లల మృతదేహాలు కనిపించాయి. దీంతో క్షుద్రపూజల కోసం తమ పిల్లలను చంపి ఉంటారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. గ్రామస్తులతో కలిసి రహదారిని దిగ్బంధించి నిరసన చేపట్టారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆధారాల సేకరణ కోసం ఫోరెన్సిక్ బృందాలను రప్పించారు. పిల్లల శరీరంలోని ఎముకలు విరిగినట్లు గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో వారు మరణించి ఉంటారని పోలీసులు అనుమానించారు. చిన్నారుల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు పిల్లల మరణంపై కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీస్ అధికారి వెల్లడించారు.