ముంబై: ప్రముఖ హోటల్ వద్ద ఒకే నంబర్ ప్లేట్‌తో రెండు కార్లు కనిపించాయి. (Cars With Same Number) భద్రతా పరంగా ఇది కలకలం రేపింది. ఒక కారు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ రెండు కార్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లోన్ నుంచి తప్పించుకునేందుకు మరో కారు యజమాని నంబర్ ప్లేట్ మార్చినట్లు బయటపడింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం 11.30 గంటలకు రెండు మారుతీ సుజుకీ ఎర్టిగా కార్లు తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌కు చేరుకున్నాయి. ఆ రెండు క్యాబ్‌లకు ఒకే నంబర్ ప్లేట్ ఉన్నాయి.
కాగా, తన కారు నంబర్ ప్లేట్ ఎంహెచ్ 01ఈఈ2388 మరో కారుకు ఉండటాన్ని యజమాని సకీర్ అలీ గమనించాడు. అతడు నడపని ప్రాంతాల నుంచి చలాన్లు రావడం గురించి ఇప్పటికే ఫిర్యాదు చేసిన అతడు వెంటనే అలెర్ట్ అయ్యాడు. మరో కారు కీస్ తీసుకుని ఆ డ్రైవర్‌ను నిలదీశాడు. అయితే ఆ డ్రైవర్ కీస్ లాక్కొన్ని కారులో అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు సకీర్ అలీ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజ్ హోటల్ వద్ద గతంలో ఉగ్ర దాడి జరిగిన నేపథ్యంలో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అదే నంబర్ ప్లేట్ ఉన్న మరో కారును అడ్డుకున్నారు. రెండు కార్లను పోలీస్ స్టేషన్‌కు తరలించి యజమానులను ప్రశ్నించారు.
కాగా, ముంబైలోని సీవుడ్స్కు చెందిన ప్రసాద్ కదమ్ ఫైనాన్స్ సంస్థ నుంచి కారు లోన్ పొందాడు. అయితే ఈఎంఐలు చెల్లించడంలో ఇబ్బందిపడ్డాడు. దీంతో తప్పించుకునేందుకు తన కారు నంబర్ ప్లేట్ ఎంహెచ్ 01ఈఈ2383ను 2388గా మార్చినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.