లక్నో: హత్య జరిగిన 17 ఏళ్ల తర్వాత ఒక వ్యక్తి సజీవంగా కనిపించాడు. అయితే అతడ్ని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న నలుగురు జైలుకెళ్లారు. (Man Found Alive After Murder) అతడు బతికే ఉన్నట్లు తెలుసుకుని పోలీసులు, జైలుకు వెళ్లిన బాధితులు షాక్ అయ్యారు. బీహార్లోని డియోరియాకు చెందిన నాథుని పాల్ 2009లో అదృశ్యమయ్యాడు. బంధువు కుటుంబం అతడి భూమిని లాక్కొని హత్య చేసినట్లు మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బంధువు కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి, అతడి సోదరులపై హత్య కేసు నమోదు చేశారు. నలుగురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కొంత కాలం తర్వాత వారు బెయిల్పై విడుదలయ్యారు. నిందితుల్లో పెద్ద వ్యక్తి మరణించాడు.
కాగా, జనవరి 6న ఝాన్సీ పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి కనిపించాడు. అతడ్ని 50 ఏళ్ల నాథుని పాల్గా గుర్తించారు. 17 ఏళ్ల కిందట ఆ వ్యక్తి హత్యకు గురైనట్లుగా బీహార్ పోలీస్ రికార్డుల్లో నమోదైనట్లు తెలుసుకున్నారు. ఆరు నెలలుగా ఝాన్సీలోని గ్రామంలో నివసిస్తున్న అతడ్ని బీహార్ పోలీసులకు అప్పగించారు.
మరోవైపు 17 ఏళ్ల కిందట హత్యకు గురైనట్లుగా భావించిన నాథుని పాల్ సజీవంగా తిరిగి రావడం చూసి బీహార్ పోలీసులతోపాటు జైలుకెళ్లిన బాధితులు షాక్ అయ్యారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరు మరణించగా ముగ్గురు ఇంకా ఆ హత్య కేసును ఎదుర్కొంటున్నారు. ఆ ముగ్గురు సోదరులు బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చారు.