లక్నో: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన సైనిక చర్య ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల జన్మించిన 17 మంది ఆడ శిశువులకు వారి తల్లిదండ్రులు ‘సిందూర్’ అని పేరు పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మే 10, 11 తేదీల్లో కుషినగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో 17 మంది ఆడపిల్లలు జన్మించారు. తల్లిదండ్రులు తమ బిడ్డలకు ‘సిందూర్’ అని పేరు పెట్టారు. ఆ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్కే షాహి ఈ విషయాన్ని ధృవీకరించారు.
కాగా, పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ పట్ల తాము గర్విస్తున్నామని ఆడ బిడ్డకు జన్మనిచ్చిన కుషినగర్‌కు చెందిన అర్చన షాహి తెలిపారు. అందుకే తమ కుమార్తెకు ‘సిందూర్’ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు.
మరోవైపు తన కుమార్తె పెద్దయ్యాక తన పేరులోని నిజమైన అర్థాన్ని అర్థం చేసుకుంటుందని, దేశం పట్ల విధేయతగల మహిళగా ఎదుగుతుందని భతాహి బాబు గ్రామానికి చెందిన వ్యాసముని ఆకాంక్షించారు. ‘సిందూర్’ పేరు తన కుమార్తెలో ధైర్యాన్ని నింపుతుందని పద్రౌనా ప్రాంతానికి చెందిన ప్రియాంక దేవి అన్నారు.