కొత్తగూడెం ప్రగతి మైదాన్, సుబేదారి, హిమాయత్ నగర్, మార్చి 29 : ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య సాగిన ఎదురు కాల్పుల్లో 17 మంది మావోయిస్టులు మృతి చెందగా.. నలుగురు జవాన్లు గాయపడ్డారు. మృతుల్లో రూ.25 లక్షల రివార్డు ఉన్న పెద్ద క్యాడర్ మావోయిస్టు కూడా ఉన్నారు. సుక్మా జిల్లా కేరళపాల్లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు ఏకే-47 గన్లు, ఎస్ఎల్ఆర్లతోపాటు 12 ఆయుధాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో 11 మంది మహిళలు, రూ.25 లక్షల రివార్డు ఉన్న స్టేట్ జోనల్ కమిటీ సభ్యుడు జగదీశ్ అలియాస్ భుద్ర ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు.
ఛత్తీస్గఢ్లో జనవరి 12 నుంచి మార్చి 25 వరకు 78 మంది మావోయిస్టులను, ఆదివాసీలను హతమార్చిన కేంద్ర, రాష్ట్ర హంతక కగార్ దాడులను ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలు ఖండించాలని మావోయిస్టు పార్టీ బస్తర్ డివిజన్ అధికార ప్రతినిధి మోహన్ పిలుపునిచ్చారు. బూటకపు ఎన్ కౌంటర్లను తక్షణమే నిలిపేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.