కట్ని: కూలీ పని కోసం బీహార్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 163 మంది బాలలను మధ్యప్రదేశ్ రైల్వే పోలీసులు ఆదివారం రక్షించారు. వీరందరినీ లాతూర్కు తీసుకెళుతుండగా.. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీ చేసి రక్షించామని వారు తెలిపారు. బాధితులంతా 6 నుంచి 13 ఏండ్ల లోపువారని తెలిపారు. ఈ ఘటనపై మనుషుల అక్రమ రవాణా నేరం కింద కేసు నమోదు చేసి 8 మంది నిందితులను అరెస్ట్ చేశామని వారు వెల్లడించారు.
పాట్నా-పూర్ణా ఎక్స్ప్రెస్లో సరైన టికెట్లు, పత్రాలు లేకుండా వీరంతా ప్రయాణిస్తుండగా కట్ని రైల్వే స్టేషన్లో తనిఖీ చేసి అదుపులోకి తీసుకొన్నామని చెప్పారు. పిల్లలంతా అరారియా ప్రాంతానికి చెందినవారని.. వారి తల్లిదండ్రులకు అక్రమ రవాణా గురించి సమాచారం అందిస్తామని కట్ని ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ వీరేంద్ర సింగ్ తెలిపారు. బాలలను కల్ని, జబల్పూర్లోని చిన్నారుల సంరక్షణ యూనిట్లకు తరలించామని ఆయన చెప్పారు.