లక్నో, జనవరి 19: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ 16 ఏండ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఓ వ్యక్తి, కారులో తీసుకెళ్తూ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేకాదు ఈ దారుణాన్ని నిందితుడు తన ఫోన్లో రికార్డ్ చేసినట్టు పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో నిందితుడు రషీద్‌ను గత శుక్రవారం అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు.
అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం, పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన వివరాల్ని పోలీసులు ఆదివారం మీడియాకు వెల్లడించారు. కారు డ్యాష్‌బోర్డ్‌లో లభించిన ఐడెంటిటీ కార్డుతో నిందితుడ్ని పట్టుకున్నామని, చెత్త పడేసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన టీనేజ్ యువతిని కారులో వచ్చిన రషీద్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడని, అదే కారులో లైంగికదాడికి పాల్పడ్డాక గ్రామానికి సమీపంలోని ఓ రోడ్డు పక్కకు ఆమెను తోసేసి వెళ్లాడని పోలీసులు చెప్పారు.
ఘటన జరిగిన సమయంలో ఇంట్లో యువతి తల్లిదండ్రులు ఇద్దరూ లేరని, కులం పేరుతో ఆమెను దూషిస్తూ లైంగికదాడికి పాల్పడ్డాడని పోలీసులు వివరించారు. అతడు ఠాకూర్ద్వారా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందినవాడని తెలిసింది.