జైపూర్: రాజస్థాన్‌లో లగ్జరీ ఆడీ కారు( Audi Crashes) బీభత్సం సృష్టించింది. రోడ్డుసైడ్ ఉన్న ఫుడ్ స్టాళ్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో 16 మంది గాయపడ్డారు. జైపూర్‌లోని పత్రకార్ కాలనీ సమీపంలో ఉన్న కార్బాస్ సర్కిల్ వద్ద శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మరో కారుతో రేసింగ్ పోటీపడిన సమయంలో ఆడి కారు అదపు తప్పింది. డివైడర్‌ను ఢీకొన్న తర్వాత ఆ కారు రోడ్డుసైడ్ ఉన్న ఫుట్ స్టాళ్ల మీదకు దూసుకెళ్లింది. కారు అదుపు తప్పిన సమయంలో రోడ్డుపై సుమారు 50 మంది ఉన్నట్లు పోలీసు అధికారి మదన్ తెలిపారు.
ఆ కారు సుమారు 10 స్టాళ్లను ఢీకొట్టింది. సుమారు 16 మంది మీదకు దూసుకెళ్లింది. చివరకు ఓ చెట్టును ఢీకొన్న తర్వాత 100 మీటర్ల దూరంలో అది ఆగినట్లు పోలీసు అధికారి చెప్పారు. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తిని రమేశ్ బైర్వాగా గుర్తించారు. ఓ ఫుడ్‌స్టాల్‌లో హెల్పర్‌గా చేస్తున్నాడతను. గాయపడ్డవారిని ఎస్ఎంఎస్ ఆస్పత్రికి తరలించారు. ఆడీ కారు డ్రైవర్‌ను దినేశ్ రిన్వాగా గుర్తించారు. అతను వ్యాపారవేత్త. మరో ఇద్దరితో కలిసి అతను కారును వదిలేసి పారిపోయారు.
మూడు నెలల క్రితమే ఆ వ్యాపారి ఆడీ కారు కొన్నాడు. ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. అయితే తాగి మత్తులో ఆడీ కారును నడిపినట్లు భావిస్తున్నారు. కారును, దాంట్లో ఉన్న మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు.