జైసల్మేర్, ఆగస్టు 23: హిందూమతంపై తమకే పేటెంట్ హక్కు ఉన్నట్లుగా మాట్లాడే బీజేపీ ప్రభుత్వం.. చేతల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వ కఠిన నిబంధనల కారణంగా పాకిస్థానీ హిందూ శరణార్థులు పెద్దసంఖ్యలో తిరిగి పాక్కు వెళ్లిపోతున్నారు. అక్కడ దురాగతాల కారణంగా వీరంతా భారత్కు వచ్చారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 334 మంది పాకిస్థానీ హిందువులు తిరిగెళ్లిపోయారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది నుంచి చూస్తే ఈ సంఖ్య దాదాపు 1,500గా ఉన్నదని సిమంత్ లోక్ సంఘటన్ అధ్యక్షులు హిందూ సింగ్ సోధా తెలిపారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంపై పాక్ హిందూ శరణార్థులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. భారత పౌరసత్వం పొందేందుకు అవసరమైన ప్రక్రియ పూర్తిచేసేందుకు వారివద్ద తగినంత డబ్బు లేదని, దీంతో వారు వెనక్కు వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు.