న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్‌ను ఢిల్లీ హైకోర్టు నిలిపివేయడంపై 150 మంది న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులు ఆచరిస్తున్న అసాధారణ పద్ధతులపై జోక్యం చేసుకోవాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. కేజ్రీవాల్‌కు రూస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్ ఉత్తర్వులు ఆప్‌లోడ్ కాకముందే ఢిల్లీ హైకోర్టులో ఈడీ ఎలా సవాల్ చేసింది?, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ ఎలా విచారణ చేపట్టి ఆర్డర్‌ను హోల్డ్‌లో ఉంచారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదని, న్యాయవాదుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించిందని 9 పేజీల లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, బెయిల్ మంజూరులో జాప్యం గురించి కూడా న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘ముఖ్యంగా ఈడీ, సీబీఐకు సంబంధించిన కేసుల్లో న్యాయమూర్తులు ఎక్కువ వ్యవధిలో విచారణ తేదీలు ఇస్తారు. బెయిల్ విషయాలను త్వరగా పరిష్కరించరు. న్యాయ సూత్రాలకు, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హామీకి ఇది విరుద్ధం’ అని సీజేఐకు రాసిన లేఖలో ప్రస్తావించారు.
మరోవైపు న్యాయవాదుల సమర్పణలను న్యాయమూర్తులు తమ ఆదేశాల్లో నమోదు చేయడం లేదని లాయర్లు ఆరోపించారు. కోర్టు చరిత్రలో మొదటిసారి అని పేర్కొన్నారు. చాలా అసాధారణమైన ఈ ఆచారాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఈ దేశ ప్రజలు ఎంతో ఆశతో, విశ్వాసంతో న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఈ నమ్మకాన్ని న్యాయవ్యవస్థ, న్యాయ సంఘం సమర్థించాల్సిన అవసరం ఉంది. దీని కోసం మా ఆందోళనలను పంచుకుంటున్నాం. త్వరగా వాటిని సరిదిద్దాలని ఆశిస్తున్నాం’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.