అహ్మదాబాద్: ప్రియురాలికి చెందిన నెలల కుమారుడ్ని ఒక బాలుడు హత్య చేశాడు. (Boy Kills Lover’s Child) బెడ్ పైనుంచి పడటంతో తలకు గాయమై చనిపోయినట్లు నమ్మించాడు. ఆ మరునాడు అతడు పారిపోవడంతో అనుమానించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శిశువు మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించడంతో అసలు విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో ఆ బాలుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కేరళకు చెందిన 22 ఏళ్ల మహిళకు ఒక వ్యక్తితో పెళ్లైంది. అతడు వదిలేయడంతో గురుగ్రామ్‌లోని సోదరి వద్దకు ఆమె చేరింది. అక్కడ 15 ఏళ్ల బాలుడితో ఆ మహిళకు పరిచయం ఏర్పడింది. సన్నిహితం పెరుగడంతో వారిద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. మహారాష్ట్రలోని థాణేకు చేరుకున్నారు. వదిలేసిన భర్త ద్వారా గర్భం దాల్చిన ఆ మహిళ అక్కడ బాబుకు జన్మనిచ్చింది. అనంతరం వీరిద్దరూ కలిసి గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాకు చేరుకున్నారు. ఉమర్గామ్లోని అద్దె ఇంట్లో పిల్లాడితో కలిసి నివసిస్తున్నారు.
కాగా, జనవరి 13న ఆ మహిళ తన నాలుగు నెలల కుమారుడ్ని ఆ యువకుడికి అప్పగించింది. బట్టలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లింది. తిరిగి వచ్చేసరికి ఆమె బిడ్డ మరణించాడు. మంచం పైనుంచి పడటంతో తలకు గాయమై ఆ పసి బాబు మరణించినట్లు అతడు చెప్పాడు. ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసి చిన్నారి మృతదేహాన్ని ఖననం చేశారు.
మరోవైపు ఆ మరునాడు యువకుడు ఇంటి నుంచి పారిపోయాడు. దీంతో తన నాలుగు నెలల కుమారుడ్ని ప్రియుడు చంపి ఉంటాడని ఆ మహిళ అనుమానించింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఖననం చేసిన శిశువు మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. పోస్ట్‌మార్టం నిర్వహించగా తలకు తీవ్ర గాయాలతో పసి బాబు మరణించినట్లు తేలింది.
కాగా, పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. పారిపోయిన యువకుడు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో ఉన్నట్లు తెలుసుకున్నారు. అక్కడకు వెళ్లి అరెస్ట్ చేసి గుజరాత్‌కు తీసుకువచ్చారు. ఆ బాలుడ్ని ప్రశ్నించగా ప్రియురాలి పసి బాబు తలను నేలకేసి కొట్టి చంపినట్లు ఒప్పకున్నాడు. ఆ బిడ్డను తనకు అప్పగించి ఆ మహిళ పనికి వెళ్లడం, కుమారుడున్న ఆమెతో పెళ్లికి తన కుటుంబం ఒప్పుకోదని భావించి అడ్డు తొలగించుకునేందుకు ఈ పని చేసినట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకుని జువెనైల్ హోమ్‌కు తరలించారు. అతడి వయస్సును నిర్ధారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.