న్యూఢిల్లీ: మార్కెట్లో నిరంతరం చక్కెర సరఫరాను కొనసాగించేందుకు, కృత్రిమ కొరతను నివారించేందుకు ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటి నుంచి చక్కెర కోటా విధానాన్ని సవరించనున్నది. ఇందులో భాగంగా చక్కెర మిల్లులకు 15 రోజుల విక్రయ కోటాలను కేటాయించనుంది. నిల్వలను దాచి పెట్టడాన్ని అరికట్టడం, రిటైల్ చక్కెర ధరలను స్థిరీకరించడం ఈ చర్య ముఖ్య ఉద్దేశం. అలాగే విక్రయించిన ఏడు రోజుల్లోగా చక్కెరను రవాణా చేయాలని మిల్లులను ఆదేశించారు. ప్రస్తుతం ఆహార శాఖ నెలావారీ ప్రాతిపదికన చక్కెర మిల్లులకు విక్రయ కోటాలను నిర్ణయిస్తున్నది.
కాగా దేశంలో చక్కెర కొరత లేదని శుక్రవారం ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవలి రోజుల్లో మిల్లుల వద్ద చక్కెర ధరలు 20 శాతం మేర తగ్గాయని పునరుద్ఘాటించింది. రిటైల్ మార్కెట్లో కూడా చక్కెర ధరలు తగ్గడం ప్రారంభమైందని పేర్కొంది. మిల్లుల్లో తలెత్తుతున్న పలు సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి తీసుకురానున్న విధానంలో మిల్లులు తమకు కేటాయించిన కోటాలో కనీసం 40 శాతాన్ని సెప్టెంబర్ మొదటి వారంలో విక్రయించాలి.