బెళగావి(కర్ణాటక), అక్టోబర్ 2: బెళగావి జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియలో ఫారమ్-7 దరఖాస్తులను ఉపయోగించి 198 మంది ముస్లిం ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడానికి ప్రయత్నించారన్న ఆరోపణలపై కర్ణాటక బీజేపీ నేత రవి పాటిల్, ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు శుక్రవారం తెలిపారు. అంతేకాకుండా సర్ అవకతవకలపై కనీసం రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
వాటిలో ఒకటి మైసూరులో స్థానిక బీజేపీ నాయకులు, ఇతరులపై నమోదైంది. సర్ ప్రక్రియలో తన ఓటును, తన కుటుంబసభ్యుల ఓట్లను, ఇతర ముస్లిం సమాజ సభ్యుల ఓట్లను తొలగించేందుకు కుట్ర జరిగిందని, తద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీసి, సమాజంలో అశాంతిని సృష్టిస్తున్నారని ఒక ఫిర్యాదుదారుడు ఆరోపించారు. బెళగావి నార్త్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 12వ వార్డులో బూత్ ఏజెంట్‌గా చేస్తున్న మీరా సాబ్ సనది సెప్టెంబర్ 30న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాటిల్‌పై బెళగావి మార్కెట్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైందని పోలీసులు చెప్పారు.