హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హోదాల్లో పని చేస్తున్న జర్నలిస్టులందరికీ ప్రభుత్వం వెంటనే క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిందని, అందులో ఇండ్ల స్థలాలు, రూ.వంద కోట్ల సంక్షేమ నిధి, హెల్త్ కార్డులు, అక్రెడిటేషన్లు, పెన్షన్ వంటివి ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇప్పటివరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదని అల్లం నారాయణ గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో అమలైన హెల్త్‌కార్డును సైతం ఈ ప్రభుత్వం రద్దు చేసిందని, ఇది అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. హెల్త్‌కార్డుల కోసం టీయూడబ్ల్యూజే రాష్ట్రవ్యాప్త ఉద్యమంలో భాగంగా శుక్రవారం సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట గాంధీచౌక్ నుంచి పోస్టుకార్డు ఉద్యమాన్ని అల్లం నారాయణ ప్రారంభించారు.
కొత్తగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వకపోగా, గతంలో జేఎన్జే హౌసింగ్ సొసైటీకి ఇచ్చిన పేట్‌బషీరాబాద్ స్థలాన్ని తిరిగి తీసుకున్నారని ఆరోపించారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని అల్లం నారాయణ హెచ్చరించారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతీసాగర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం జర్నలిస్టులకు హెల్త్ కార్డులను తొలగించిందని ఆవేదన వ్యక్తంచేశారు.
హెల్త్ కార్డుల కోసం రాష్ట్రవ్యాప్తంగా వారంపాటు పోస్టు కార్డ్ ఉద్యమం కొనసాగనున్నదని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షుడు రమేశ్ హజారీ, తెంజూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ రమణకుమార్, టీయూడబ్ల్యూజే కోశాధికారి పీ యోగానంద్, హైదరాబాద్ నగర ఇన్చార్జి యార నవీన్‌కుమార్, అధ్యక్షుడు రాకేశ్‌రెడ్డి, కోశాధికారి బాపురావు, ఐజేయూ నాయకుడు తిరుపతినాయక్, కలూరి రాజు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఫొటో జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు భాసర్ పాల్గొన్నారు.