Girl Fight with Bear | భల్లూకాన్ని చూస్తేనే చాలామంది దడుసుకుంటారు.. అది దాడి చేసే ఇంకేమైనా ఉందా? ప్రాణాల మీద ఆశలు వదులుకోవడమే. కానీ, ఓ బాలిక తన ప్రాణాలను పణంగా పెట్టి.. శివంగిలా పోరాడి తన తండ్రి ప్రాణాలను కాపాడుకున్నది. ఈ ఘటన రాజస్థాన్లోని సిరోహి జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. సెరోహిలోని సిల్దార్ గ్రామంలో ఓ రైతు పొలం సోమవారం అర్ధరాత్రి పొలం వద్ద నిద్రిస్తున్న సమయంలో ఎలుగుబంటి దాడి చేసింది. భల్లూకాన్ని చూసి కుక్కలు పెద్దగా అరవడం మొదలుపెట్టాయి.
పొలం పక్కనే ఇంట్లో నిద్రిస్తున్న సదరు వ్యక్తి 14 సంవత్సరాల జ్యోత్స్న వెంటనే బయటకు వచ్చింది. తండ్రిని కాపాడుకునేందుకు ఎలుగుబంటిపై కర్రతో విరుచుకుపడింది. అప్పటికే ఆ భల్లూకం బాలిక తండ్రి కర్మ రామ్ చౌదరిని తీవ్రంగా గాయపరిచింది. ఆ తర్వాత సదరు రైతును గుజరాత్లోని మెహసానా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నాడు. నాకేం జరిగినా ఫర్వాలేదు.. తన తండ్రిని ప్రాణాలతో కాపాడుకోవాలి అని నిర్ణయించుకొని.. భల్లూకంతో కర్రతో విరుచుకుపడ్డట్లు బాలిక తెలిపింది. ‘మొదట భయంతో కాళ్లు వణికాయి. నాన్నను కాపాడుకోవాలని ఉద్దేశంతో కర్రతో ఎలుగుబంటిపై దాడిచేశాను.
ఎలుగుబంటి ఇంకా వేగంగా దాడి చేయడం మొదలుపెట్టింది. నేను ఇంకా వేగంగా దాడి చేయడంతో నాపై దాడికి ప్రయత్నించింది. అది చూసి మా అమ్మ రాళ్లు విసిరింది. దాంతో పోరాడడం తప్ప నాకు వేరే మార్గం లేదు. ఏడెనిమిది నిమిషాలు ఎలుగుబంటితో పోరాడాను. ఆ తర్వాత చివరకు పారిపోయింది’ అని బాలిక వివరించింది. తన ప్రాణాలను సైతం లెక్క చేయక భల్లూకంతో పోరాడిన బాలికను గ్రామస్తులు అభినందిస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం బాలికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలికకు అవార్డు ఇవ్వాలని పలువురు నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.