Indian Institutes | న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ టైమ్స్ మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ గ్లోబల్ ర్యాంకింగ్స్, 2024లో భారతీయ బిజినెస్ స్కూల్స్ ర్యాంకులను సాధించాయి. ప్రపంచంలోని టాప్-100 సంస్థల్లో మన దేశానికి చెందిన 14 విద్యా సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రిసెర్చ్ (ఎస్పీజేఐఎంఆర్)కు 35వ ర్యాంకు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ (ఐఐఎం-ఏ)కు 39వ ర్యాంకు; ఐఐఎం, బెంగళూరుకు 41వ ర్యాంకు లభించాయి. స్విట్జర్లాండ్లోని సెయింట్ గాల్లెన్ వర్సిటీ ప్రథమ స్థానంలో నిలిచింది.
హర్యానాలో కాంగ్రెస్తో ఆప్ పొత్తు లేనట్టే!
న్యూఢిల్లీ: హర్యానా శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు దాదాపు లేనట్టే కనిపిస్తున్నది. సోమవారం 20 మంది అభ్యర్థులతో ఆప్ తొలి జాబితాను విడుదల చేసింది. ఎన్నికల్లో పొత్తు కోసం రెండు పార్టీల మధ్య పలు దఫాలు చర్చలు జరిగినా సీట్లు సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఆప్ 10 స్థానాలను కోరుతుండగా, ఐదు స్థానాలను ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఆప్ హర్యానా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సుశీల్ గుప్తా సోమవారం మాట్లాడుతూ, సాయంత్రానికి కాంగ్రెస్తో పొత్తు కుదరకపోతే, తాము మొత్తం 90 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు.
ఏడాది ఆఖరులో జెలెన్స్కీ భారత్ పర్యటన
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ ఏడాది చివరలో భారత్లో పర్యటించే అవకాశాలున్నాయని భారత్లోని ఉక్రెయిన్ అంబాసిడర్ ఒలెక్సాండర్ పోలిషుచుక్ సోమవారం తెలిపారు. రష్యాతో యుద్ధానికి అంతం పలికేందుకు జరిగే శాంతి శిఖరాగ్ర చర్చల్లో భారత్ పాల్గొంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇటీవల మోదీ ఉక్రెయిన్ పర్యటనలో తమ దేశంలో పర్యటించాలని జెలెన్స్కీని కోరారన్నారు. మోదీ ఆహ్వానం మేరకు తమ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ ఏడాది ఆఖరులో భారత్కు విచ్చేస్తారన్నారు.