న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3కి ముహూర్తం ఖరారైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 14వ తేదీ.. మధ్యాహ్నం 2.35గంటలకు ఎల్వీఎం-3 (లాంచ్ వెహికల్ మార్క్ 3) రాకెట్ ప్రయోగానికి ఇస్రో సర్వం సిద్ధం చేసింది. చంద్రయాన్-3 మిషన్ ఈసారి కచ్చితంగా సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ చేపడతామన్నారు. ఈ ప్రయోగాన్ని మూడు దశల్లో ఇస్రో చేపడుతున్నది. చంద్రుడిపై 14-15 రోజులే సూర్యుడి కాంతి పడుతుంది. ఈ సమయంలోనే సాఫ్ట్ ల్యాండింగ్ ఉంటుందని ఇస్రో అధికారులు చెప్పారు.