భోపాల్, అక్టోబర్ 9: డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధి పరుగులు అని గొప్పలు చెప్పుకునే బీజేపీ పాలించే రాష్ర్టాలు ఎటువంటి దుస్థితిలో ఉన్నాయో ఈ ఉదంతమే రుజువు చేస్తుంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో పోలీసు కానిస్టేబుల్ నియామక పరీక్ష కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. 7,500 పోస్టుల కోసం దాదాపు 9.5 లక్షల దరఖాస్తుల రావడం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది. అయితే అంతకన్నా దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే కానిస్టేబుల్ నియామక పరీక్షకు కనీస విద్యార్హత కేవలం 10వ తరగతి కాగా 52,000 మంది పోస్టుగ్రాడ్యుయేట్లు, 33,000 మంది గ్రాడ్యుయేట్లు, 12,000 మంది ఇంజనీర్లు, దాదాపు 50 మంది పీహెచ్డీ హోల్డర్లు దరఖాస్తు చేసుకున్నారు.
అక్టోబర్ 30న రెండు షిఫ్టులలో ఈ నియామక పరీక్ష జరగనున్నది. ఉన్నత చదువులు చదువుకున్నవారు కూడా 10వ తరగతి స్థాయి కానిస్టేబుల్ పరీక్షకు ఎందుకు దరఖాస్తు చేసుకోవలసి వచ్చిందని ఆరా తీయగా ఆ పోస్టు విలువ కన్నా ఉద్యోగ భద్రతకే అత్యధికులు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిసింది. మధ్యప్రదేశ్‌లో ఉద్యోగ అవకాశాలు బాగా తగ్గిపోవడంతో డిగ్రీ, పీజీ హోల్డర్లు సైతం ఉద్యోగ భద్రత ఉన్న చిన్న ఉద్యోగమైనా దొరికితే చాలనుకునే పరిస్థితి ఏర్పడింది. చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం దొరకపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తు చేసినట్లు ఛింద్వారాకు చెందిన పల్లవి చౌకీకర్ అనే ఎంబీఏ డిగ్రీ హోల్డర్ తెలిపారు. డిగ్రీ ఉన్నా మంచి ఉద్యోగం ఇక్కడ దొరకడం లేదని, బతకడానికి వేరే మార్గం లేక ఈ పోస్టుకు దరఖాస్తు చేశానని ఆమె వాపోయారు. పీజీ తర్వాత కూడా తగిన ఉద్యోగం దొరకపోవడంతో కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తు చేశానని గణితంలో ఎంఎస్సీ చదివిన బేతుల్‌కు చెందిన నిధి ధోటే తెలిపారు.