జైపూర్, జూన్ 28 : బీజేపీ పాలిత రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. శ్రీ గంగానగర్లో ఓ రిక్షావాలా 13 ఏండ్ల బాలికను అక్కడి హోటల్ యజమానికి అమ్మేయగా..ఆమెపై 30 మంది లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు హోటల్ యజమానులు, నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. ఐదు రోజులపాటు తనపై పదే పదే లైంగికదాడి జరిగిందని, మద్యం తాగించి 30 మంది అఘాయిత్యానికి పాల్పడినట్టు బాధితురాలు పోలీసులకు తెలియజేసింది.
బాధితురాలు తన ఇంటి నుండి అదృశ్యమైనప్పుడు ఈ దుస్థితి తలెత్తిందని, ఒక రిక్షాలాగే వ్యక్తి ఆమెను ఒక హోటల్ యజమానికి విక్రయించాడని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. బాలికపై లైంగిక దాడిలో ఇతర హోటల్ నిర్వాహకుల ప్రమేయం కూడా ఉన్నట్టు తెలిసింది. ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నం జరుగుతున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ ఘటన తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది. శ్రీగంగానగర్ పర్యాటక కేంద్రం కానప్పటికీ, అక్కడ 150కిపైగా అక్రమ హోటల్స్ నడుస్తున్నాయని సమాచారం. దీంతో వాటిని మూసివేయాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.