బెంగళూరు: కర్ణాటకలోని (Karnataka) హవేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున బైడగి తాలుకాలోని గుండేనహళ్లి సమీపంలో పుణె-బెంగళూరు జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ఓ మినీ బస్సు ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న 13 మంది మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
బాధితులంతా శివమొగ్గ జిల్లా ఎమ్మిహట్టి గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. వారంతా సవదత్తిలోని ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నదని చెప్పారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బస్సు నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
చేగుంటలో రెండు లారీలు ఢీ.. డ్రైవర్ సహా ఐదురుగురు దుర్మరణం
మెదక్: మెదక్ జిల్లా చేగుంటలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వడియారం వద్ద బైపాస్ రోడ్డుపై రెండు లారీలు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. శుక్రవారం ఉదయం బైపాస్ రోడ్డులో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. దీంతో వెనుక లారీ డ్రైవర్‌తోపాటు క్యాబిన్లో కూర్చున్న ఐదుగురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నదని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.