Delhi | న్యూఢిల్లీ, మే 19: తొమ్మిదేండ్ల తన పాలనలో బస్తీలను అభివృద్ధి చేయని మోదీ ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు మురికివాడలను మాయం చేసేందుకు యత్నిస్తున్నది. త్వరలో జరగనున్న జీ-20 సదస్సు నేపథ్యంలో విదేశీ ప్రతినిధులకు పేదలు, మురికివాడలు కనిపించకుండా చేసేందుకు బస్తీలను కూల్చాలని ఆరాట పడుతున్నది. జీ-20 సదస్సు దృష్ట్యా ఇప్పటికే వీధి బాలలు, యాచకులను తరలించేందుకు ఉపక్రమించిన కేంద్ర ప్రభుత్వం కన్ను ఇప్పుడు ఢిల్లీలోని మురికివాడలపై పడింది.
డా.రాజేంద్రప్రసాద్ రోడ్డులో ఉన్న జేజే క్లస్టర్ మురికివాడను కూల్చివేయాలని నిర్ణయించింది. అక్కడ నివసిస్తున్న 124 నిరుపేద కుటుంబాలకు ఇండ్లు ఖాళీ చేయాలంటూ మే 16న నోటీసులు జారీ చేసింది. నాలుగు రోజుల్లోపు నివాసాలను ఖాళీ చేయాలని అందులో పేర్కొంది.
ఈ బస్తీలో సుమారు 500 మందికి పైగా నివసిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, అర్బన్ అఫైర్స్ పేరిట అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై మజ్దూర్ ఆవాస్ సంఘర్ష్ సమితి కన్వీనర్ నిర్మల్ గోరానా అగ్ని స్పందించారు. మురికివాడల్లో నివసిస్తున్న దళితులను అధికారులు హింసిస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు గతంలో వెలువరించిన తీర్పులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీనిపై బస్తీ వాసి మంజుదేవి మాట్లాడారు. ‘జీ-20 సదస్సు నేపథ్యంలో బలవంతంగా ఖాళీ చేయించి ఇండ్లను కూల్చివేస్తున్నారు. పునరావాసం కల్పించకుండా రోడ్డున పడేస్తున్నారు’ అని ఆమె పేర్కొన్నారు. ‘చిన్నారుల గురించి ఆలోచించడం లేదు. పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది’ అని కృష్ణ అనే మరో మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.