ఎవరి పెళ్లికైనా వెళ్తే భోజనాలు ఎందుకు పెడతారు? కడుపు నిండా తిని మనసు నిండా ఆశీర్వదిస్తారని. కానీ ఒక కాంగ్రెస్ నేత ఇంటికి ఇలాగే వెళ్లిన అతిథులకు పెద్ద కష్టమే వచ్చింది. పెళ్లికి వెళ్లి సుష్టుగా భోజనం చేసిన వీళ్లంతా తెల్లారేసరికి వాంతులు, విరేచనాలతో మంచాన పడ్డారు. ఈ ఘటన గుజరాత్లోని మెహ్సానాలో వెలుగు చూసింది.
సావలగ గ్రామం విస్నానగర్ తాలూకాలో శుక్రవారం రాత్రి స్థానిక కాంగ్రెస్ నేత ఇంట వివాహ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో రకరకాల వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేశాడు. ఆయన మీద అభిమానంతో ఈ పెళ్లికి అతిథులుగా వెళ్లిన 1200 మంది ఆస్పత్రి పాలయ్యారు.
ఈ పెళ్లిలో భోజనం చేసిన 1200 మంది తెల్లారేసరికి డయేరియా, వాంతులతో ఇబ్బంది పడ్డారు. వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించి వారికి చికిత్స అంిస్తున్నారు. ఈ వివాహంలో పెట్టిన విందు భోజనం శాంపిల్స్ తీసుకొని ఫారెన్సిక్ సైన్స్ లాబొరేటరీ, ఫుడ్ అండ్ డ్రగ్ డిపార్ట్మెంట్కు పంపినట్లు పోలీసులు తెలియజేశారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.