న్యూఢిల్లీ, డిసెంబర్ 12: దుబాయ్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సు-2023(కాప్28) సందర్భంగా అనూహ్య పరిణామం చోటుచేసుకొన్నది. లిసిప్రియా కంగుజం అనే మణిపూర్‌కు చెందిన 12 ఏండ్ల పర్యావరణ కార్యకర్త వేదికపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. శిలాజ ఇంధనాలకు ముగింపు పలకాలని గట్టిగా నినాదాలు చేస్తూ ప్లకార్డును ప్రదర్శించింది. కొంత సేపు స్టేజీపైనే కూర్చొని నినాదాలు ఇచ్చింది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని ఆ బాలిక ఈ సందర్భంగా గట్టిగా వ్యతిరేకించింది. ఒక్కసారిగా వేదికపైకి రావడంతో సమావేశానికి హాజరైన వివిధ దేశాల ప్రతినిధులు కొంత గందరగోళానికి గురయ్యారు.
ఆ తర్వాత బాలిక ధైర్యాన్ని మెచ్చుకుంటూ అక్కడున్న వారు చప్పట్లతో ప్రశంసించారు. అనంతరం భద్రతా సిబ్బంది ఆమెను వేదికపై నుంచి కిందకు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన లిసిప్రియా కంగుజం.. నిరసన తర్వాత తనను 30 నిమిషాల పాటు నిర్బంధించారని పేర్కొన్నారు. ఈనాటి పర్యావరణ సంక్షోభానికి ప్రధాన కారణంగా ఉన్న శిలాజ ఇంధనాలకు ముగింపు పలకాలని తాను కోరడమే నేరమైందని, నిర్వాహకులు తనను కాప్28 సదస్సు నుంచి తొలగించారని తెలిపారు.