Ujjain Rape Shocker | కామాంధుల కామ వాంఛకు బలై.. రక్తమోడుతున్నా వీధి వీధి తిరిగి.. గడప గడపకు వెళ్లి తలుపు తట్టి.. 2 గంటల పాటు సాయం అర్థించి.. 8 కిలోమీటర్లు నడిచినా ఆదుకునేవారే కరవాయే. సాయమడిగితే చీదరింపులు.. ఛీత్కారాలు.. ఆపదలో ఉన్నానని చెబితే.. అడుక్కునేవారికి ఇచ్చినట్టు చిల్లర చేతిలో పెట్టి.. సాయం అర్థించిన బాలికను ఒంటరిని చేశారు. కుళ్లిన ఈ సమాజంలో సాయం కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురుచూసినా స్పందించేవారే కానరాకపాయే. ఉజ్జయినిలో లైంగికదాడికి గురైన 12 ఏండ్ల బాలిక అర్ధనగ్నంగా తిరుగుతూ పడిన నరకయాతన ఇది.
ఉజ్జయిని, సెప్టెంబర్ 28: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో బాలికపై లైంగికదాడి ఘటనలో దారుణాలు వెలుగులోకి వచ్చాయి. కామాంధుల చేతిలో లైంగికదాడికి గురైన ఆ బాలిక సాయం కోసం వీధివీధి తిరిగినా ఎవరూ స్పందించలేదు. రక్తమోడుతున్నగాయాలు బాధపెడుతున్నా ఆమె 2 గంటలకుపైగా సాయం కోసం ఆమె అర్థించింది. సుమారు 8 కిలో మీటర్లు అర్ధనగ్నంగా నడిరోడ్డుపై తిరిగినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంటింటికి వెళ్లి తలుపు తట్టినా మానవత్వం అనేది మచ్చుకైనా కనిపించలేదు. సాయమడిగిన ఆమెకు చీదరింపులు.. ఛీత్కారాలే ఎదురయ్యాయి. మరికొందరైతే ఆపదలో ఉన్నానని.. తనను ఎవరో వెంబడిస్తున్నారని చెబితే చేతిలో చిల్లర పెట్టినట్టు తెలుస్తున్నది.
మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాకు చెందిన 12 ఏండ్ల బాలిక తాతయ్య వద్ద తన అన్నతో పాటు ఉంటున్నది. ఆమె తండ్రికి మతిస్థిమితం సరిగా లేదు. తల్లి వారిని వదిలేసింది. ఇంట్లో మనస్పర్థల కారణంగా ఆమె ఈనెల 24న సత్నా నుంచి 700 కిలో మీటర్ల దూరంలోని ఉజ్జయిని వచ్చింది. తర్వాతి రోజు ఆమె లైంగికదాడికి గురైంది. అనంతరం గాయాలతోనే ఆమె సాయం కోసం ఉజ్జయినిలో నడిరోడ్డుపై 8 కిలోమీటర్లు తిరిగింది. సుమారు 2 గంటల పాటు ఇంటింటికి వెళ్లి సాయం అర్థించింది. చివరకు ఓ ఆశ్రమం వద్ద స్పృహ తప్పిపడిపోయిన ఆమెను ఓ పూజారి పోలీసుల సాయంతో దవాఖానకు తరలించారు.
బాలికకు సాయం చేసిన పూజారి రాహుల్ శర్మ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘రక్తమోడుతూ సాయం కోసం అర్థిస్తున్న బాలికను ఆశ్రమం వద్ద చూశా. మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆమె స్పందించలేదు. ఆమె కళ్లు వాచిపోయాయి. నీకేం కాదని ధైర్యం చెప్పా. కొత్త వాళ్లను చూడగానే ఆమె నా వెనుక దాక్కునేందుకు ప్రయత్నించింది. బాలిక ఏదో చెప్పింది. కానీ నాకు అర్థం కాలేదు. పెన్ను, పేపర్ అందించినా ఏమీ రాయలేదు. వస్ర్తాలు ఇచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాను’ అని ఆయన తెలిపారు.
లైంగికదాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమెతో మాట్లాడిన ఐదుగురిని ప్రశ్నించారు. ఓ ఆటోడ్రైవర్ సహా నలుగురిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిలో ఆటో డ్రైవర్ భరత్ సోనిని ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఒంటరిగా వెళ్తున్న బాలికపై అతడు అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి వద్ద నుంచి బాలిక వస్ర్తాలను రికవరీ చేసినట్టు తెలుస్తున్నది. ఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలను సైతం సంపాదించినట్టు పోలీసులు తెలిపారు. తప్పించుకునేందకు ప్రయత్నించిన అతన్ని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తొలుత ఐదుగురు అనుమానితులను పోలీసులు ప్రశ్నించారు.