లక్నో: ఒక బాలికను ఐదుగురు బాలురు ప్రలోభపెట్టారు. ఆమె ఇంటి పక్కనే ఉన్న స్కూల్ బిల్డింగ్‌లోకి తీసుకెళ్లారు. మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించారు. ఆ తర్వాత బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. (Girl Gang Raped In School) దీనిని వీడియో రికార్డ్ చేసి ఎవరికీ చెప్పవద్దని ఆమెను బెదిరించారు. ఈ వీడియో క్లిప్ బయటపడటంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఐదుగురు మైనర్ బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మే 8న సాయంత్రం వేళ 12 ఏళ్ల బాలిక ఇంటి బయట ఆడుకుంటున్నది. అదే వీధిలో నివసిస్తున్న 12 నుంచి 15 ఏళ్ల వయస్సున్న ఐదుగురు బాలురు ఆమెను ప్రలోభపెట్టారు. బాలిక ఇంటి సమీపంలో ఉన్న స్కూల్ బిల్డింగ్‌లోకి ఆమెను తీసుకెళ్లారు. మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించారు. ఆ తర్వాత బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. దీనిని వీడియో రికార్డ్ చేశారు. ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని ఆ బాలికను వారు బెదిరించారు.
కాగా, పొరుగున ఉండే వ్యక్తి ఈ వీడియో చూసి ఆ బాలిక తల్లికి చెప్పడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో మే 20న బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో 7 నుంచి 9వ తరగతి చదువుతున్న ఐదుగురు మైనర్ బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జువెనైల్ హోమ్‌కు వారిని తరలించారు.
మరోవైపు బాధిత బాలిక, నిందితులైన బాలురు దళిత వర్గానికి చెందిన వారని పోలీస్ అధికారి తెలిపారు. ఒక బాలుడి తండ్రి ఆ స్కూల్లో వాచ్‌మేన్‌గా పని చేస్తున్నట్లు చెప్పారు. దీంతో తాళాలతో ఆ స్కూల్ గేట్ తెరిచి బిల్డింగ్ లోపలకు బాలికను తీసుకెళ్లిన బాలురు ఈ నేరానికి పాల్పడినట్లు పోలీస్ అధికారి వివరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.