BRT | మధ్యప్రదేశ్‌లోని ఉమారియా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. 12 సంవత్సరాల బాలుడిని పులి చంపేసింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. పిపారియాకు చెందిన విజయ్ కోల్ అనే బాలుడు తాతతో కలిసి బంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ (BTR)లో అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఇప్పపూలను సేకరించేందుకు వెళ్లినట్లుగా ఓ అధికారి పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే అక్కడే పొదల్లో నక్కిన బాలుడిని చూసి దాడి చేసిందని పేర్కొన్నారు. అభయారణ్యంలోని ధమోఖర్ రేంజ్లో ఈ సంఘటన జరిగిందని ఆయన చెప్పారు. బాలుడు పూలను సేకరిస్తున్న సమయంలో అక్కడే పొదల్లో నుంచి గమనించిన పులి.. ఒక్కసారిగా బాలుడిపై దాడి చేసింది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయ్ శంకర్ శ్రీవాస్తవ తెలిపారు.
బాలుడిని పులి కొంత దూరం ఈడ్చుకుపోయిందని చెప్పారు. గ్రామస్తులు కేకలు వేయడంతో మృతదేహాన్ని కాలువ వద్ద వదిలి పారిపోయిందని పేర్కొన్నారు. అయితే, గ్రామస్తులు అక్కడికి చేరుకునే లోపే బాలుడు చనిపోయాడని వివరించారు. నిబంధనల మేరకు బాలుడి కుటుంబానికి రూ.8 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు వివరించారు. సమాచారం అందుకున్న బంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించింది. గత మూడువారాల్లో పులి దాడి చేయడం ఇది మూడోసారి. గతంలో పన్పఠ బఫర్, పన్పఠ కోర్లోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి.