స్పీకర్‌ను కలువనున్న 12 మంది శివసేన ఎంపీలు
ముంబై, జూలై 18: శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్ తగిలింది. పార్టీ 18 మంది ఎంపీల్లో 12 మంది తిరుగుబావుటా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కలువనున్నారు. తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ రాయనున్నట్టు ఎంపీ కళబేన్ దేల్కర్ తెలిపారు. శివసేన తిరుగుబాటు నేత, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ 12 మంది ఎంపీలు ఆయనతో సమావేశం కానున్నట్టు తెలుస్తున్నది. షిండేతో భేటీ అయ్యే ఎంపీలపై చర్యలు తీసుకుంటామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ హెచ్చరించారు.
సస్పెన్షన్ల పర్వం
ద్రోహం చేస్తున్న నేతలపై ఉద్ధవ్ సస్పెన్షన్ అస్ర్తాన్ని ప్రయోగిస్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సీనియర్ నేత రాందాస్ కడమ్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. మాజీమంత్రి విజయ్ శివతారే, మాజీ ఎంపీ అనంద్రావ్, ఎమ్మెల్యే సంతోశ్,కీలక నేత నరేశ్ మస్కేను సస్పెండ్ చేశారు. కాగా, కడమ్ శివసేనకు రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని అన్నారు.