థానే/హిస్సార్, ఏప్రిల్ 26: దేశంలో ఆక్సిజన్ కొరత, సరఫరాలో సమస్యలతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. సోమవారం మూడు వేర్వేరు రాష్ర్టాల్లో కనీసం 12 మంది కొవిడ్ రోగులు ప్రాణవాయువు అందక మరణించారు. హర్యానాలో ఐదుగురు, మహారాష్ట్రలో నలుగురు చనిపోగా ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఓ దవాఖానలో సాంకేతిక లోపంతో ముగ్గురు మృతి చెందారు. హర్యానాలో హిస్సార్ జిల్లాలోని ఓ ప్రైవేటు దవాఖానలో సోమవారం ఐదుగురు కొవిడ్ రోగులు మృతిచెందారు. దవాఖానలో ఆక్సిజన్ కొరత కారణంగా తమ వాళ్లు చనిపోయారని మృతుల కుటుంబసభ్యులు దవాఖాన ఎదుట ఆందోళనకు దిగారు. మహారాష్ట్రలోని ఓ ప్రైవేటు దవాఖానలో సోమవారం నలుగురు చనిపోయారు. అయితే రోగులు ఆక్సిజన్ లేక చనిపోలేదని, వారి పరిస్థితి ముందే విషమంగాఉందని దవాఖాన వర్గాలు తెలిపాయి. దీనిపై దర్యాప్తునకు కమిటీని నియమించినట్టు రాష్ట్రమంత్రి జితేంద్ర అవధ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం ప్రభుత్వ దవాఖానలో ‘హై ఫ్లో ఆక్సిజన్’ అందక ఇద్దరు కొవిడ్ రోగులు చనిపోయారు. దవాఖానలో 97 మందికి వైద్యులు ఆక్సిజన్ అందిస్తున్నారు. అందులో 12 మందికి హై ఫ్లో ఆక్సిజన్ అవసరం. సోమవారం తెల్లవారుజామున హై ఫ్లో ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముగ్గురు చనిపోయారు. మిగతా రోగులను వేరే దవాఖానకు తరలించినట్టు డీఎంహెచ్వో రమణ కుమారి తెలిపారు.