మహారాష్ట్ర : మహారాష్ట్ర థాణె జిల్లాలోని అంబర్నాథ్(Ambernath)మున్సిపల్ కౌన్సిల్లో ఏర్పడిన తాజా రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని గడచిన అనేక ఏండ్లుగా బలంగా వినిపిస్తున్న బీజేపీ.. అంబర్‌నాథ్‌లో అధికారం కోసం కాంగ్రెస్‌తోనే జతకట్టడం సంచలనం సృష్టించింది. బీజేపీకి మద్దతుగా ఓటేసిన 12 మంది కౌన్సిలర్లపై(Congress councilors) కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్లు
బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
కాగా, అంబర్నాథ్ వికాస్ అఘాడీ పేరిట బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ(అజిత్ పవార్) జతకట్టాయి. 14 మంది బీజేపీ కౌన్సిలర్లు, 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, నలుగురు ఎన్సీపీ(అజిత్ పవార్) కౌన్సిలర్లు, ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్‌తో కలసి మున్సిపల్ కౌన్సిల్లో మెజారిటీ సాధించి మేయర్ పదవిని కైవసం చేసుకోవాలని ఈ కూటమి భావించింది. ఈ కూటమి మద్దతుతో బీజేపీ నాయకురాలు తేజస్వీ కరంజులే మేయర్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత శివసేన(షిండే వర్గం) అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మేయర్ పదవికి ఆ పార్టీని దూరం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ చేతులు కలపడం వివాదాస్పదమైంది.