భోపాల్, జూన్ 12: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో భార్యాభర్తలు కలిసి కనీసం రోడ్ల మీద తిరగలేని పరిస్థితి కనిపిస్తున్నది. భర్తతో కలిసి హోటల్‌కు వెళ్లిన భార్యపై ముగ్గురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం జరుగగా వివరాలను పోలీసులు ఆదివారం వెల్లడించారు. భార్యాభర్తలు కలిసి భోపాల్‌లోని ఓ హోటల్‌కు వెళ్లారు. అనంతరం భర్త హోటల్‌లోనికి వెళ్లగా బైక్ పార్కింగ్ విషయంలో ఆయన భార్యకు, ముగ్గురు వ్యక్తులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆ ముగ్గురు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో ఆమె ఒక వ్యక్తి చెంపపై కొట్టి హోటల్‌లోనికి వెళ్లారు. తర్వాత భర్తతో కలిసి హోటల్ నుంచి బయటికి వచ్చారు. అప్పటికే కొమ్ముకాచి కూర్చున్న దెబ్బతిన్న వ్యక్తి పదునైన పేపర్ కట్టర్‌తో ఆమెపై దాడి చేశాడు. ముఖంపై తీవ్రగాయాలు కావడంతో భర్త దవాఖానకు తరలించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు ముఖంపై 118 కుట్లు వేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు దుండగులను అరెస్టు చేసి, మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.