Maharashtra : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఒక సిమెంట్ మిక్సర్ వాహనాన్ని ప్రయాణికులతో వెళ్తున్న ఈకో వ్యాన్ ఢీకొన్న ఘటనలో 11 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన థానే జిల్లా, కల్యాణ్-ముర్బాద్ నేషనల్ హైవే 61పై, గోవిలి గ్రామ సమీపంలోని రైతా బ్రిడ్జి వద్ద సోమవారం ఉదయం జరిగింది. 10.45 గంటల సమయంలో ఈకో వ్యాన్ కొంతమంది ప్రయాణికులతో కల్యాణ్ నుంచి ముర్బాద్ వెళ్తోంది.
ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న సిమెంట్ మిక్సర్ వాహనాన్ని వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మిగతా ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇంకా పలువురు గాయపడ్డారు. ఘటన సమచారం అందుకున్న స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఎనిమిది మంది పురుషులు ఉన్నారు. వీరిలో ఇద్దరు కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నారు. ఘటన జరిగిన ప్రదేశంలో దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి.
రెండు వాహనాలు ఒకదానిలోకి ఒకటి చొచ్చుకుపోయాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు గుజరాత్లో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న యాత్రికులపైకి ఓ ట్రక్కు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు.