చెన్నై: తమిళనాడులోని తంజావూరులో (Thanjavur) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కలిమేడు అప్పర్ ఆలయ రథం విద్యుత్ తీగకు తగలడంతో 11 మంది సజీవదహనమయ్యారు. మరో 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అప్పర్ గురుపూజై (అయ్యప్పస్వామి పండుగ) సందర్భంగా స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు రథాన్ని వీధులగుండా గుడికి తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తు అది హైటెన్షన్ వైర్లకు తగిలింది. షార్ట్‌సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. దీంతో 11 మంది కాలి బూడిదయ్యారు. వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని దవాఖానకు తరలించామన్నారు.
అగ్నిప్రమాద ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.